వెండితెర పై రైతు రాజకీయం

farmer based Politics on Silver Screen

రైతే రాజు.. రైతే దేశానికి వెనముక అనే పదాలను చిన్నప్పటి నుండి వింటున్నాం, కానీ అదే రైతుకు తినడానికి తిండిలేక, అప్పుల ఊబిలో చిక్కుకున్నాడు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంత మంది నాయకలు మారినా రైతుల పరిస్థితి మాత్రం మారదు.  రైతుల పక్షాన మేముంటాం అంటూ మన రాజకీయ నాయకులు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఇప్పుడు సినిమా వాళ్లు కూడా అదే కోవకు చెందుతున్నారు. నిజానికి రైతుల కష్టాలు అనేది ఎప్పటికి బర్నింగ్ సబ్జెక్ట్ అందుకే చాలా మంది సినిమా వాళ్లు దాన్ని వాడుకుంటారు. అయితే తెలుగు నాట ఇప్పుడు ఇద్దరు అగ్రశ్రేణి నటులు, నాయకులు చేస్తున్న సినిమాలు వెండితెర మీద రైతుల పేరుతో రాజకీయ లాభం అనే అంశానికి తెర తీశాయి. అర్థంకాలేదా..? మొత్తం స్టోరీ చదవండి.

రైతు నిజానికి కమర్షియల్ గా లాభాల్లో లేకున్నా కానీ అతడి చుట్టూ తిరిగే సినిమాలు మాత్రం కమర్షియల్ గా హిట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇదే ఫార్ములాతో మన ముందుకు తలకు తలపాగా బదులు స్టార్ డమ్ ను చుట్టుకొని వస్తున్నారు కొత్త రైతులు. వీళ్లు చేసేది వ్యవసాయం కానీ స్క్రీన్ మీద మాత్రమే. ఇంతకీ వాళ్లు ఎవరు అనుకుంటున్నారా.? ఒకరు ఓ తెలుగు రాష్ట్రంలో అధికార పక్షానికి చెందిన రైతు బాలకృష్ణ.. మరొకరు ప్రతిపక్షానికి చెందిన ఎంపీ చిరంజీవి. మరి ఈ వెండితెర వ్యవసాయంతో వీరు పండించాలనుకుంటోన్న పంటలేంటో చూద్దాం.

తాజాగా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న మెగాస్టార్ చిరంజీవి రైతుల సమస్యలతో ముడిపడిన కథాంశంతోనే ముందుకు వస్తున్నాడు. అందులో భాగంగా సెజ్ ల పేరుతో తాము కోల్పోతున్న భూమి కోసం కొందరు గ్రామస్తులతో కలిసి ఓ యువకుడు సాగించిన పోరాటమే.. తమిళంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ కత్తి నేపథ్యం. ఇలా తన సినిమాలో రైతులకు అండగా నిలిచే ఓ నాయకుడిగా చిరు కనిపించనున్నాడు. అయితే ఈ సినిమా ద్వారా చిరంజీవికి రెండు రకాల లాభాలు కలుగుతాయి.

చిరుకు లాభాలు..
1. రీఎంట్రీకి రైతుల సమస్య అనే బలమైన సబ్జెక్ట్ ఖచ్చితంగా వర్కవుట్ అవుతుంది
2. పొలిటికల్ లీడర్ గా కూడా రైతుల్లో చిరంజీవికి ఓ మంచి అభిప్రాయం ఏర్పడుతుంది.

చిరంజీవి తన రీ ఎంట్రీ కోసం.. తన ఇమేజ్ కోసం ఏదైనా కమర్షియల్ సబ్జెక్ట్ కాకుండా ఇలా రైతు సబ్జెక్ట్ నే ఎంచుకోవడం వెనక రాజకీయ కోణాలు కూడా ఉన్నాయనేది సత్యం. ఇది ఆల్రెడీ హిట్ అయిన సబ్జెక్ట్ కాబట్టి.. ఈ సినిమాతో అటు కమర్షియల్ హిట్ కొట్టినట్టూ ఉంటుంది.. ఇటు రాజకీయంగా తనకూ లబ్ధి చేకూరుతుంది. అతేకాక మొన్నామధ్య ఓ టివి ఫంక్షన్ లో ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉంటాయని.. చరిత్రలో నిలిచిపోయే సినిమా అవుతుందని రాజకీయ నాయకుడి తరహాలో హామీలిచ్చేశాడు. అంటే ఓ రకంగా ఈ సినిమాతో ఆంధ్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టే ప్రణాళికలేవో రచించుకునే ఉంటాడు అనుకుంటున్నారు.

ఇక మరోపక్క నందమూరి నటసింహం బాలకృష్ణ 101 సినిమాలో రైతుగా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇక్కడ కొన్ని గమనించాలి. చిరంజీవి తీస్తున్న సినిమా అయిపోయిన తర్వాత ఈ సినిమా రాబోతోంది. ఒకవేళ చిరంజీవి తన రాజకీయ ప్రయోజనాల కోసం సినిమాను వాడుకుంటే… అదే సినిమాను వాడుకొని.. నాడు ఎన్టీఆర్ చేసినట్లు ప్రభుత్వాన్ని వెనకేసువస్తాడు అనే అభిప్రాయం వినిపిస్తోంది. మొత్తానికి వెండితెర మీద రైతు రాజకీయం బాగా రసవత్తరంగా ఉండబోతోంది అనేది మాత్రం వాస్తవం.

Related posts:

Comments

comments