తమిళనాట రాజకీయాలు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. జయలలిత మరణం తర్వాత ఇప్పటికే అన్నాడిఎంకె పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. శశికళ పార్టీలో పట్టుకోసం పావులు కదుపుతుండటం, పన్నీర్ సెల్వం శశికళను కలవడం లాంటి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే అందరూ జయలలిత పార్టీలో జరుగుతున్న వాటి గురించే పట్టించుకుంటున్న టైంలో కరుణానిధి పార్టీలో కూడా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న విషయాన్ని గుర్తించాలి. తాజాగా ఆ పార్టీ చీఫ్ కరుణానిధి రాహుల్ గాంధీపై గుర్రుగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దీనిపై రాహుల్ కు ఓ మెయిల్ కూడా చేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటి అంటే…
జయలలిత అంతిమ సంస్కారాలకు రావడం ఏంటి అని కరుణానిధి మండిపడ్డారని అనుకుంటున్నారా? అస్సలు కాదు. కరుణానిధికి, ఆ పార్టీ ఎంపీలకు కోపం రావడానికి కారణం వేరే ఉంది. అదేమిటంటే రాహుల్ గాంధీ జయలలిత అనారోగ్యంగా ఉన్నప్పుడు, చనిపోయిన తర్వాత రెండు సార్లు చెన్నై వెళ్లారు. జయలలిత అంత్యక్రియలకు వచ్చిన రాహుల్ కనీసం రెండు మూడు గంటల పాటు చెన్నై నగరంలోనే ఉన్నారు. కానీ, అనారోగ్యం పాలై స్థానిక కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధిని ఆయన మాటవరుసకు కూడా పరామర్శించలేదు కదా.. అసలు డీఎంకే నేతల వద్ద కూడా ఆయన ఆరోగ్యం గురించి వాకబు కూడా చేయలేదు. ఇది డీఎంకే నేతలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. గతంలో రాహుల్ తల్లి, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అనారోగ్యానికి గురైనపుడు కరుణానిధి ప్రత్యేకంగా లేఖ రాసి ఆమె ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. కానీ రాహుల్ మాత్రం కనీసం పట్టించుకోలేదు.
అయితే ఇక్కడ రాజకీయ కోణంలోనూ దీన్ని గమనించాలి. అదేమిటంటే రాహుల్ గాంధీ చేసింది తప్పు అనే సంకేతాన్ని కాంగ్రెస్ పార్టీకి అందించడంతో పాటు అదే టైంలో మోదీతో నడవడానికి తాము సిద్ధంగా ఉన్నామని కరుణానిధి పార్టీ వర్గాలు ఓ రకంగా సిగ్నల్స్ ఇస్తున్నట్లే. కేవలం అతి తక్కువ మెజార్టీతో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ నుండి దాదాపుగా వైదొగిలితే అధికారం చేతులు మారే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. అందుకే ఇప్పుడు మోదీ తమిళనాట పరోక్షంగా చక్రం తిప్పే అవకాశాలున్న నేపథ్యంలో కరుణానిధి కీలకంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతానికి అన్నాడీఎంకేకు చెందిన పన్నీరు సెల్వం, శశికళలు మోదీకి అనుకూలంగానే ఉన్నారు కానీ ఆధిపత్యంకోసం గొడవ జరిగితే మాత్రం ఎమ్మెల్యేలు చీలిపోతారు. అప్పుడు కరుణానిధికి అవకాశం లభిస్తుంది. కాబట్టి డీఎంకే పార్టీ దీన్ని రాజకీయ ఎత్తుగడగా వాడుకోవచ్చు.