కేసీఆర్ సారూ.. మాకు ఈ గతేంది?

Student Letter to Telangana CM KCR

తెలంగాణలో ఉన్న అన్ని సమస్యలకు ఒకటే పరిష్కారం.. సర్వ రోగనివారణి జిందా తిలిస్మాత్ లాగా.. తెలంగాణ రాష్ట్రం ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం అని నాడు కేసీఆర్ సారూ… మా అందరికి చెప్పిండ్రు. ఆయన మాటలు వినుకొని..సావుడో.. తెలంగాణ తెచ్చుడో అని మా బోటి విద్యార్థులు కూడా ఆత్మ బలిదానాలు చేశిండ్రు. ఎన్నో సార్లు ఉస్మానియల, కాకతీయ యూనివర్సిటీల లాఠీల దెబ్బలకు ఒళ్లు హూనమైనా దెబ్బలకు భయపడలేదు. తెలంగాణ ఉద్యమానికి విద్యార్థులు ఎంతో కీలకంగా మారిండ్రు అని విని ఇంగింత రెచ్చిపోయినం. ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారింది.

తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది తోటి విద్యార్థులు సదువులు మాని.. పోర బాట పట్టిండ్రు. తెగిచ్చినోళ్లకు అడ్డం ఏ ముంది. ఇండ్ల కాడ అమ్మలు భయపడుతున్న కూడా ఉస్మానియాల, కాకతీయ యూనివర్సిటీల్ల పోర ఆపలే. నా బిడ్డకు ఏమైతదో.. అని ఇంటి కాడ అమ్మ ముద్దు కూడా ముట్ట కుంటే. ఫోన్ చేసి అమ్మకు దైర్ఘం చెప్పినం. నాలుగు దినాలు మనం చేసే పోరాటం తరతరాలకు పనికివస్తది అని అర్థమయ్యేటట్లు చేసినం. ఇంటి కాడ నాయన కష్టపడుతుంటే. సూడలేక చదువులు ఆపలేక ఆపినం. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తయంట కదా బిడ్డా.. మరి పోరు చెయ్యిండ్రి కానీ కూసింత హోషియారీగా ఉండు బిడ్డా అని మా నాయన చెప్పిన మాట విన్నం.. కానీ క్యాంపస్ ల దాన్ని మర్చినం.

రాజకీయ నాయకులు మాత్రం రాజీనామాలు చేస్తే.. పలానా నాయకుడు రాజీనామా చేసిండు అని పెద్ద పెద్ద అక్షరాల తోన రాసిండ్రు.. కానీ యూనివర్సిటీల్ల ఎంతో మంది కూడు తినకుండ.. ఉపవాస దీక్షలు చేస్తే నిమిషం వార్త చెప్పి మూషిండ్రు. హాస్టల్ల తిండి బంద్ చేశిండ్రు.. తాగనింక నీళ్లు కూడా లేనట్ల చేశిండ్రు.. అయినా గూడ మేం మాత్రం పోరాటం ఆపలే.. పోరాడినం. తెలంగాణ ఏర్పడినంక ఇక్కడ పోరాడుతున్న ప్రతి విద్యార్థికి ఉద్యోగం వస్తది అని మీరు(కేసీఆర్) చెబుతుంటే లక్ష ఊహల్ల తేలినం.

నాలుగు కొట్ల మంది ఆకాంక్ష నెరవేరింది… వేల మంది విద్యార్థుల త్యాగాలకు ఫలితం దక్కింది. మా నీళ్లు మా ఉద్యోగాలు అన్న నినాదానికి న్యాయం చేసే టైం వచ్చింది అనుకున్నం. కానీ నీళ్ల సంగతి ఏందో మాకు తెల్వదు కానీ ఉద్యోగాల సంగతి ఏందో మాకు మాత్రం అర్థం కావడం లేదు. ఎందుకంటే ఉద్యమం టైంల మస్తు ఉద్యోగాలు ఉన్నయి అని క్యాంపస్ ల కాడ లెక్చర్ ఇస్తే నిజమే అనుకున్నం…జూన్ రెండు తారీఖు ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తం అని ప్రకటిస్తే సంబరపడ్డం. కానీ అదంత ఏం లేదు అని అనిపిస్తున్నది. మాకు ఉద్యోగాలు వస్తయి అనుకున్న వాళ్లకు ఉద్యోగాలు వస్తాయి త్వరలో అనే వార్తనే రెండేళ్ల సంది ఇనిపిస్తున్నది.

నీ బిడ్డ ఏం చేస్తున్నడు అని అడిగితే ఇంటి కాడ మా బిడ్డ తొందర్లనే కొలువుల చేరతడు అని అమ్మ అమాయకంగా చెబుతుంది. నాయన ఎన్ని దినాలైనా నా కొడుకు గవర్నమెంట్ నౌకరీ కొట్టి ఇంటికొస్తడు అని ధీమాగా ఉన్నడు. తీరా చూస్తే ఆ టైం ఎంతకీ రాదాయె. ఉద్యోగుల విభజన పేరుతోన యాడది చేస్తిరి.. ఉన్నోళ్లను పర్మినెంట్ చేస్తం.. మిగిలిన వాళ్లకు ఉద్యోగాలు ఇస్తం అంటిరి అది కూడా కాదాయె. ఇంటికాడ గింజ గింజకు కష్టమాయె… నాయన ఫోన్ చేసి బిడ్డ అంతా బాగుండది.. ఇంటి చింత మరువు అని అంటడు.. కానీ ఇంటికాడ పరిస్థితి ఏందో మాకు తెల్వదా..? అప్పులు చేసి ఇళ్లు నడిపిస్తున్నడు నాయిన. అమ్మ కూలి పనికి పోయి వస్తుంది.

లక్ష ఉద్యోగాలు అంటివి.. మరి ఆ లక్ష ఉద్యోగాలు యాడికి పోయినవి సారూ..? మీ ఇంట్ల నాలుగు ఉద్యోగాలు ఇచ్చిండ్రు అంట కదా అని మేం అడుగుత లేం కానీ మాకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తయ్ అని అడుగుతున్నం. అందరూ అన్నట్లు మీరు ఎలక్షన్ టైంలనే ఉద్యోగాలు వేస్తరా..? ఇప్పటికే మస్తు లేటైతున్నది అని ఇంటి కాడ అందరు గుబులు పడుతున్నరు. లక్ష రూపాయల అప్పు చేసిన కూడా నాకు తెల్వదు అన్నట్లనే మా నాయన నటిస్తున్నడు. అప్పుడేమో ఉద్యమంల లాఠీ దెబ్బలు తింటిమి.. ఇప్పుడేమో ఉద్యోగాల కోసం కళ్లు పెద్దవి చేసుకొని కూర్చుంటుమి. మీరు అన్నట్ల వయస్సు ఎక్కువైనా అప్లై చెయ్యనింకె అవకాశం ఇస్తరేమో కానీ మా పరిస్థితి మాత్రం అంతకంతకు అద్దానంగా మారుతున్నది మరి దానికి గురించి కూడా ఆలోచించుండ్రి సారూ.

– మిమ్మల్ని అభిమానించే ఓ తెలంగాణ విద్యార్థి

Related posts:
చంద్రబాబు మాట్లాడుతుంటే.. బావలు సయ్యా పాట!
గవర్నమెంట్ ఉద్యోగం వద్దని.. కోట్లు సంపాదిస్తున్నాడు
ఇది ధోనీ లవ్ ఫెయిల్యూర్ స్టోరీ
తెలంగాణలో పచ్చదనం కోసం ఫైరింజన్లు
వీళ్లకు ఏమైంది..?
కువైట్ లో 13మంది భారతీయులకు ఉరి
పుష్కరాల్లో సెల్ఫీ బాబూ
జగన్ అన్న.. సొంత అన్న
స్వర్ణం సాధిస్తే హైదరాబాద్ రాసిచ్చే వారేమో...
ఏపీకి టోపీ..ప్రత్యేక హోదా లేదు....!
అతివృష్టి.. సర్వే-సమీక్ష-సహాయం
రాజీనామాలు అప్పుడే
పది వేల ఉద్యోగాలు పాయే... ఇదంతా చంద్రబాబు పుణ్యమే!
బాంబులతో కాదు టమాటలతో .. పాక్ పై భారత్ టమాట యుద్ధం
బాబు బిత్తరపోవాల్సిందే..
చైనా టపాసులు ఎందుకు వద్దంటే..?
తిరిగబడితే తారుమారే
కరెన్సీ నోట్లపై మోదీ ఏమన్నారు
అప్పు 60 రోజులు ఆగి చెల్లించవచ్చు.. కేంద్రం తీపి కబురు
చెబితే 50.. దొరికితే 90
స్థానిక ఎన్నికల్లో బిజెపి గెలుపే కానీ..
జన్‌ధన్ అకౌంట్లకు కొత్త కష్టాలు
ఏపిలో వచ్చే ఏడాదే ఎన్నికలు
బంగారం రేటు మరీ అంత తగ్గిందా?

Comments

comments