వైసీపీ ఫైర్ బ్రాండ్.. చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా చేసే వ్యాఖ్యలు ఎంత తీవ్రంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పంచ్ డైలాగులకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే ఆమె.. ఏపీ అధికారపక్షంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుంటారు. ఏ మాత్రం అవకాశం చిక్కినా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును.. ఆయన పరివారాన్ని బండకేసి ఉతికినట్లుగా ఉతికేసే రోజా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్నితెలుగుదేశం ప్రభుత్వం వేధిస్తోందని.. కానీ తాము అలాంటి వేధింపులకు భయపడమని చెప్పుకొచ్చారు రోజా. తెలుగుదేశం పార్టీ ఆరిపోయే దీపమని.. అక్రమ కేసులకు తాము భయపడేది లేదన్న ఆమె.. పార్టీ కార్యకర్తలకు తాము అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. గాలి ముద్దుకృష్ణమ నాయుడ్ని ఎన్నికల్లో ప్రజలు ఛీ కొట్టినా బుద్ది రాలేదన్నారు. తమపై అక్రమ కేసులు పెడుతున్నారని.. చంద్రబాబు కుట్రలు ప్రజలకు తెలిసిపోయాయని ఆమె వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ముఖ్యమంత్రి కావటం ఖాయమని ఆమె జోస్యం చెప్పారు. అంత నమ్మకమే ఉండి ఉంటే.. జగన్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఆ రకంగా వచ్చేస్తారా రోజా? అన్న ప్రశ్నకు ఆమె ఏం బదులిస్తారో..?